తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్: కేటీఆర్

  • నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో భారీగా కురిసిన తొలి వాన
  • చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయన్న కేటీఆర్
  • కాంగ్రెస్ సర్కార్ కేవలం రాజకీయాలపైనే దృష్టి పెడుతోందని విమర్శ

నైరుతి రుతుపవనాల రాకతో హైదరాబాద్‌లో కురిసిన తొలి పెద్ద వానకే నగరం అతలాకుతలమైంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ ప్రభుత్వంపై, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ విమర్శనాస్త్రాలు సంధించారు. 'తొలి వానకే చేతులెత్తేసిన సర్కార్‌' అంటూ సోషల్ మీడియా వేదికగా ఆయన తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.


మున్సిపల్ శాఖను తన వద్దే ఉంచుకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, నగర ప్రజలు గంటల తరబడి ట్రాఫిక్‌లో నరకం చూస్తున్నా కనీస బాధ్యత లేకుండా వ్యవహరిస్తున్నారని కేటీఆర్ మండిపడ్డారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ హయాంలో వర్షాకాలం కంటే ముందే ఎస్‌ఎన్‌డీపీ, ఎస్‌ఆర్‌డీపీ పథకాల ద్వారా నాలాల పూడికతీత, వ్యర్థాల తొలగింపు పనులను పక్కాగా సమీక్షించేవాళ్లమని గుర్తు చేశారు. ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ఆ పద్ధతులను పూర్తిగా గాలికొదిలేయడం వల్లే చిన్నపాటి వర్షానికే రోడ్లన్నీ జలమయమయ్యాయని ఆరోపించారు.


తెలంగాణ ఆర్థిక ఇంజన్‌ అయిన హైదరాబాద్ ప్రగతిని రేవంత్ సర్కార్ పూర్తిగా నిర్లక్ష్యం చేసిందని, పరిపాలనను వదిలేసి కేవలం రాజకీయాల పైనే దృష్టి పెడుతోందని ఆరోపించారు. వర్షం పడగానే గంటల తరబడి విద్యుత్ సరఫరా నిలిచిపోవడం, విద్యుదాఘాతాల వల్ల ప్రాణాలు కోల్పోతున్న ఘటనలపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తూ.. ప్రభుత్వానికి ముందస్తు సన్నద్ధత ఎక్కడ ఉందని నిలదీశారు.


పాలనను పక్కనబెట్టి ప్రతిపక్షాలపై కక్షసాధింపులకు ప్రాధాన్యమిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వానికి, త్వరలో రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో హైదరాబాద్ ప్రజలు తగిన బుద్ధి చెప్పడం ఖాయమని కేటీఆర్ హెచ్చరించారు. ఈ తొలి వాన రాజకీయం ఇప్పుడు తెలంగాణలో బీఆర్ఎస్ వర్సెస్ కాంగ్రెస్ మధ్య లొల్లిని మరింత ముదిరేలా చేసింది.


KTR
Hyderabad Rains
Revanth Reddy
BRS vs Congress Telangana
Hyderabad Traffic Jams
Telangana Municipal Administration

More Telugu News